More languages

Machine translation by Google, for convenience only. It may contain errors; the English and Telugu pages are the reliable versions.

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్షేనా? ఫంక్షన్ హాల్ బోర్డులు, BBC కథనం, ట్రెస్‌పాస్ చట్టం – సుప్రీంకోర్టు ఏం చెప్పింది

వనపర్తి ఫంక్షన్ హాల్ బోర్డు నేపథ్యంలో: పిలవని పేరంటానికి వెళ్తే BNS సెక్షన్ 329 కింద నేరమా? క్రిమినల్ ట్రెస్‌పాస్, మాత్రి కేసులో సుప్రీంకోర్టు తీర్పు, విదుర నీతి, అన్నదానం–విందు తేడా.

ఇటీవల తెలంగాణలోని వనపర్తిలో ఒక ఫంక్షన్ హాల్ ముందు ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఫంక్షన్‌కు సంబంధం లేనివారు లోపలికి వచ్చి దొరికితే సెక్షన్ 441 (ప్రస్తుత బీఎన్ఎస్ సెక్షన్ 329) ప్రకారం మూడు నెలల జైలు, రూ.5,000 జరిమానా విధిస్తారని యాజమాన్యం పేరుతో అందులో హెచ్చరిక రాశారు. ఈ అంశంలోని చట్టపరమైన విషయాలపై మాట్లాడేందుకు BBC తెలుగు నన్ను సంప్రదించినప్పుడు, తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా నా అభిప్రాయాన్ని వారితో పంచుకున్నాను.

BBC తెలుగు వార్తా కథనంలో సహజంగానే చట్టపరమైన అంశాలను క్లుప్తంగా మాత్రమే ప్రస్తావించగలిగారు. అందుకే ఈ వ్యాసంలో ఈ అంశానికి సంబంధించిన చట్టాన్ని, దానితో ముడిపడిన సామాజిక, సాంస్కృతిక అంశాలను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను.

నిర్వాహకుల బాధ అర్థం చేసుకోదగ్గదే. అతిథుల కోసం వండిన భోజనం బయటివారు తినిపోతున్నారని, బయటి వ్యక్తులు ఎక్కువగా వచ్చారనే కారణంతో కొందరు కస్టమర్లు బిల్లులు తగ్గించి చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. దొంగతనాలు, భద్రతా సమస్యలు, బలవంతపు డబ్బు డిమాండ్లు కూడా ఎదురవుతున్నాయని అంటున్నారు.

కానీ అసలు ప్రశ్న ఇది: ఒక బోర్డు పెట్టినంత మాత్రాన పిలవని పేరంటానికి వెళ్లడం నేరమైపోతుందా?

ముందుగా: శిక్ష విధించే అధికారం బోర్డుకు లేదు

జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధించే అధికారం కోర్టుకు మాత్రమే ఉంది. ఫంక్షన్ హాల్ యజమాని గానీ, నిర్వాహకులు గానీ ఎవరికీ జరిమానా విధించలేరు. వారు చేయగలిగింది ప్రవేశం నిరాకరించడం, బయటకు వెళ్లమని అడగడం, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి, అది కోర్టుకు వెళ్లినప్పుడు, సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత చట్ట ప్రకారం న్యాయమూర్తి మాత్రమే శిక్ష విధించగలరు. ఎవరు పడితే వారు శిక్షలు ప్రకటించడానికి చట్టం అంగీకరించదు.

BBC తెలుగుతో నేను చెప్పింది

ఫంక్షన్ హాళ్ల బయట హెచ్చరిక బోర్డులు పెట్టినంత మాత్రాన కేసులు నమోదు కావు. చట్టం ఉద్దేశాన్ని పైపైన కాకుండా లోతుగా, విశ్లేషణాత్మకంగా చూడాలి. ఎదుటివారికి నచ్చలేదని కేసు పెట్టడానికి లేదు; చొరబడిన వ్యక్తి ఉద్దేశమే అతను నేరస్తుడా కాదా అన్నది తేలుస్తుంది. ఆ వ్యక్తి నేరపూరిత ఉద్దేశంతో ప్రవేశించాడని నిరూపించాల్సి ఉంటుంది. ఆహ్వానం లేని చోటికి వెళ్లకపోవడం విచక్షణ (Discretion), ఆత్మగౌరవం (Self-respect) మరియు మర్యాద (Etiquette / Respect) అనే మూడింటికి సంబంధించింది.

ఆహ్వానం లేని చోటికి వెళ్లాలా, వద్దా?

ఈ ప్రశ్నకు సమాధానం చట్టంలో కంటే మన విలువల్లోనే ఎక్కువగా ఉంది. ఆహ్వానం లేని చోటికి వెళ్లాలా వద్దా అనే నిర్ణయం మూడు అంశాలతో ముడిపడి ఉంటుంది – విచక్షణ (Discretion), ఆత్మగౌరవం (Self-respect), మర్యాద (Etiquette).

  • విచక్షణ: మంచి-చెడు, అవసరం-అనవసరం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే వివేకం. ఆత్మగౌరవం, మర్యాద అనే రెండు విలువలను బేరీజు వేసి తుది నిర్ణయం తీసుకునేదే విచక్షణ.
  • ఆత్మగౌరవం: నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా కాపాడుకోవడం.
  • మర్యాద: ఎదుటివారిని గౌరవిస్తూ, వారి ఇబ్బందిని అర్థం చేసుకుని నడుచుకోవడం.

విదురుడు ఏం చెప్పాడు?

మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో (విదుర నీతి), మనిషి సమాజంలో గౌరవంగా బతకడానికి ఏ పనులు చేయాలి, ఏవి చేయకూడదో విదురుడు చాలా స్పష్టంగా చెప్పాడు:

అనాహూతః ప్రవిశతి అపృష్టో బహు భాషతే |
అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతా నరాధమః ||

భావం: పిలవకుండానే లోపలికి వెళ్లేవాడు, అడగకుండానే ఎక్కువగా మాట్లాడేవాడు, నమ్మదగనివారిని నమ్మేవాడు – వీరు మూఢబుద్ధి కలిగిన అధములు. పిలవని చోటికి వెళ్లడం అంటే మన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టడమే. అందుకే విదురుడు పిలుపు లేని చోట అడుగు పెట్టవద్దని హెచ్చరించాడు.

ఆత్మగౌరవం వేరు, నేరం వేరు

పిలుపు లేని వేడుకకు వెళ్లడం చట్టపరంగా ప్రతిసారీ నేరం కాకపోవచ్చు; కానీ అది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆహ్వానం లేకుండా వెళ్లినప్పుడు, ఫంక్షన్‌కు సంబంధించినవారు “ఎందుకు వచ్చావు?” అని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదురవుతుంది. అందుకే అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిన నైతిక బాధ్యత వ్యక్తిపైనే ఉంటుంది. అయితే ఒక వాస్తవాన్ని కూడా మర్చిపోకూడదు – తీవ్రమైన ఆకలి బాధలో ఉన్నప్పుడు ఆత్మగౌరవం, మర్యాద, విచక్షణ వంటివి పనిచేయకపోవచ్చు. ఆ క్షణంలో మనిషికి కడుపు నింపుకోవడమే ప్రధానంగా కనిపిస్తుంది.

ట్రెస్‌పాస్ అంటే ఏమిటి?

ట్రెస్‌పాస్ (Trespass) అంటే ఇతరుల ఆస్తి, భూమి, ఇల్లు లేదా స్థలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, లేదా చట్టవిరుద్ధంగా అక్కడ ఉండిపోవడం. తెలుగులో దీనిని సాధారణంగా “అతిక్రమణ” లేదా “అక్రమ ప్రవేశం” అంటారు. అనుమతి లేకుండా ప్రవేశించడం చిన్న విషయంగా కనిపించినా, ఆ ప్రవేశం వెనుక ఉన్న ఉద్దేశం, పరిస్థితిని బట్టి అది సివిల్ (Civil) లేదా క్రిమినల్ (Criminal) అంశంగా మారుతుంది.

  • సివిల్ ట్రెస్‌పాస్: మరొకరి స్వాధీనంలో ఉన్న స్థలంలోకి చట్టబద్ధమైన కారణం లేకుండా వెళ్లడం. ఇది ఒక పౌర తప్పిదం (Tort); ఇక్కడ దురుద్దేశం అవసరం లేదు. పరిష్కారం సివిల్ కోర్టులో – నిషేధాజ్ఞ (Injunction), నష్టపరిహారం (Damages), స్వాధీనం తిరిగి పొందడం (Specific Relief Act సెక్షన్లు 5, 6).
  • క్రిమినల్ ట్రెస్‌పాస్: మరొకరి స్వాధీనంలో ఉన్న స్థలంలోకి నేరం చేయాలనే ఉద్దేశంతో, లేదా స్వాధీనంలో ఉన్న వ్యక్తిని భయపెట్టాలని, అవమానించాలని లేదా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రవేశించడం. జైలు శిక్ష ఉంది కాబట్టే దీనికి నేరపూరిత మనస్తత్వం (mens rea) తప్పనిసరి.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

మాత్రి వర్సెస్ పంజాబ్ రాష్ట్రం (Smt. Mathri v. State of Punjab, AIR 1964 SC 986): క్రిమినల్ ట్రెస్‌పాస్‌పై ఇది మూలస్తంభం లాంటి తీర్పు. ప్రవేశించిన వ్యక్తి ప్రధాన ఉద్దేశం (dominant intention) ఏమిటో కోర్టు చూడాలి. తన ప్రవేశం వల్ల అవతలి వ్యక్తికి చికాకు కలుగుతుందని తెలిసి ఉండటం (knowledge) వేరు, చికాకు కలిగించాలనే ఉద్దేశం (intent) వేరు. కేవలం తెలిసి ఉండటం నేరానికి సరిపోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అంటే – “నేను వెళ్తే నిర్వాహకులకు నచ్చదని నాకు తెలుసు” అనుకుని భోజనానికి వెళ్లిన వ్యక్తి ప్రధాన ఉద్దేశం భోజనం చేయడమే తప్ప, ఎవరినో చికాకుపెట్టడం కాదు.

అన్నదానం – మన సంస్కృతి

ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కొంత అన్నదానం చేయడం భారతీయ సంస్కృతి, సంప్రదాయం. అన్నదానం అంటే కేవలం ఆకలి తీర్చడం మాత్రమే కాదు; ఆకలితో ఉన్నవారికి భక్తి, శ్రద్ధ, గౌరవాలతో ఆహారాన్ని సమర్పించే పవిత్ర ధర్మం. మన వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు అన్నదానాన్ని అత్యుత్తమ దానంగా భావించాయి; “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అని పేర్కొన్నాయి.

మారుతున్న విలువలు – మనం గుర్తించాల్సిన తేడా

నేడు మన సమాజంలో రెండు వైపులా విలువలు దెబ్బతింటున్నాయి. ఒక వైపు, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ఎక్కడ పడితే అక్కడ భోజనం చేసేవారి సంఖ్య రానురాను పెరుగుతోంది. మరో వైపు, అన్నదానం అసలు అర్థం కోల్పోయి, తమకు నచ్చినవారికి మాత్రమే బంధుప్రీతితో భోజనం ఏర్పాటు చేసి దానికి “అన్నదానం” అని పేరు పెట్టడం కూడా జరుగుతోంది.

  • అన్నదానం: కులం, మతం, హోదా, పరిచయం అనే భేదం లేకుండా ఆకలితో ఉన్న ఎవరికైనా (అనాథలు, యాచకులు, బాటసారులు, పేదలు) పెట్టేది.
  • విందు: మన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, ఆత్మీయులకు (మనవాళ్లకు) పెట్టేది.

పెళ్లిరోజు బంధువులకు విందు భోజనం ఏర్పాటు చేయడం వేరు; అదే సందర్భంగా అన్నదానం జరిపించడం వేరు. ఈ రెండు సున్నితమైన అంశాల మధ్య తేడాను సమాజంలో ప్రతి ఒక్కరూ గ్రహించగలిగినప్పుడు ఇలాంటి సమస్య తలెత్తదు. అన్నదానమే మహాదానంగా భావించే మన భారతీయ సంస్కృతిలో, కాలానుగుణంగా ఇలాంటి విషయాలను చర్చించుకోవాల్సిన అవసరం రావడం శోచనీయం.

Was this article helpful?

Frequently asked questions

  1. పిలవని పెళ్లికి వెళ్లి భోజనం చేస్తే నిజంగానే జైలు శిక్ష పడుతుందా?

    లేదు, కేవలం భోజనం చేసినంత మాత్రాన జైలు శిక్ష పడదు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 329 ప్రకారం నేరం రుజువు కావాలంటే, ఆ వ్యక్తి లోపలికి ఏదైనా నేరం చేయాలనే ఉద్దేశంతో గానీ, నిర్వాహకులను భయపెట్టాలని లేదా అవమానించాలనే ఉద్దేశంతో గానీ ప్రవేశించి ఉండాలి. ఆకలితోనో, భోజనం చేయాలనే ఉద్దేశంతోనో వెళ్లడం నేరపూరిత మనస్తత్వం కిందకు రాదు.

    Criminal Defense, Bail & Quash Petitions

  2. ఫంక్షన్ హాల్ యజమానులు గేటు బయట బోర్డు పెట్టి ₹5,000 జరిమానా వసూలు చేయవచ్చా?

    వసూలు చేయలేరు. ఎవరికైనా జరిమానా విధించే అధికారం గానీ, జైలు శిక్ష వేసే అధికారం గానీ కేవలం కోర్టుకు మాత్రమే ఉంటుంది. ఫంక్షన్ హాల్ నిర్వాహకులు తమ ఆస్తిలోకి అనుమతి లేని వ్యక్తులు రాకుండా అడ్డుకోవచ్చు, బయటకు వెళ్లమని చెప్పవచ్చు లేదా అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు – కానీ వారంతట వారు శిక్షలు విధించలేరు.

    Criminal Defense, Bail & Quash Petitions

  3. ఒకవేళ ఆహ్వానం లేకుండా వెళ్లిన వ్యక్తిపై పోలీసులు కేసు పెడితే ఏమవుతుంది?

    క్రిమినల్ ట్రెస్‌పాస్ (BNS సెక్షన్ 329) అనేది బెయిలబుల్ (బెయిల్ లభించే) నేరం. ఒకవేళ కేసు కోర్టుకు వెళ్లినా, సుప్రీంకోర్టు (Smt. Mathri v. State of Punjab) తీర్పు ప్రకారం, ఆ వ్యక్తి ప్రవేశం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం (Dominant Intention) ఏమిటో కోర్టు పరిశీలిస్తుంది. నిర్వాహకులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదని, కేవలం భోజనం కోసమే వచ్చాడని తేలితే అది క్రిమినల్ నేరంగా నిలబడదు.

    Criminal Defense, Bail & Quash Petitions

  4. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంధుమిత్రులకు పెట్టే భోజనాన్ని “అన్నదానం” అనవచ్చా?

    అనకూడదు. మన బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు ఆహ్వానం పంపి ప్రేమతో పెట్టే భోజనాన్ని 'విందు' లేదా 'సంతర్పణ' అంటారు. కులం, మతం, పరిచయం అనే భేదం లేకుండా ఆకలితో ఉన్న పేదలకు, బాటసారులకు, అనాథలకు పెట్టేది మాత్రమే నిజమైన 'అన్నదానం'.

    Criminal Defense, Bail & Quash Petitions

  5. ఆహ్వానం లేని చోటికి వెళ్లాలా వద్దా అనే విషయంలో మనం ఎలా నిర్ణయం తీసుకోవాలి?

    దీనిని చట్టం కంటే మన విచక్షణ, ఆత్మగౌరవం, మర్యాద ఆధారంగా నిర్ణయించుకోవాలి. సంతోషకరమైన వేడుకలకు పిలుపు లేకుండా వెళ్లడం వల్ల మన ఆత్మగౌరవం తగ్గడమే కాకుండా, ఆతిథ్యమిచ్చే వారికి ఇబ్బంది కలుగుతుంది. అయితే, ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు లేదా పరామర్శకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆహ్వానం కోసం చూడకుండా వెళ్లడం మన బాధ్యత.

    Criminal Defense, Bail & Quash Petitions

Comments

Leave a comment

Get the latest updates & legal knowledge

New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.

This form is protected by reCAPTCHA. Google's Privacy Policy and Terms of Service apply.