More languages

Machine translation by Google, for convenience only. It may contain errors; the English and Telugu pages are the reliable versions.

Read this article in English

Post-Tenure Legal Hurdles and Guidelines for Sarpanches in Telangana

Post-Tenure Legal Hurdles and Guidelines for Sarpanches in Telangana

తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సర్పంచ్ అన్నది ఒక కీలకమైన బాధ్యత. గ్రామాభివృద్ధిలో సింహభాగాన్ని మోసే ఈ పదవి, గౌరవప్రదమైనది అయినప్పటికీ, పదవీకాలం ముగిసిన తర్వాత కొన్ని న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. చాలా మంది సర్పంచులు, తాము నిస్వార్థంగా చేసిన సేవకు ఎలాంటి ఇబ్బందులు రావని భావిస్తారు. కానీ గత ఐదేళ్లలో తెలంగాణలో 400 మందికి పైగా సర్పంచులపై వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో చాలా వరకు అవినీతి, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, మరియు రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు ఉన్నాయి. సర్పంచులు తాము తప్పు చేయలేదని వాదించినప్పటికీ, చాలామంది తమను తాము చట్టపరంగా రక్షించుకోలేకపోయారు. నిబంధనలు తెలియకపోవడం, రికార్డుల నిర్వహణలో లోపాలు, లేదా కొన్ని రాజకీయ కారణాల వల్ల పదవీ విరమణ తర్వాత కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు.

ఎలాంటి న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటారు?

సర్పంచులు సాధారణంగా ఎదుర్కొనే కొన్ని కీలక న్యాయపరమైన సవాళ్లు

నిధుల దుర్వినియోగం ఆరోపణలు: ఇది అత్యంత సాధారణమైన మరియు తీవ్రమైన ఆరోపణ. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను సరిగ్గా ఉపయోగించలేదని, లేదా పనులకు మించి నిధులు తీసుకున్నారని ఆరోపణలు రావొచ్చు. గ్రామసభ ఆమోదం లేకుండా నిధులు మళ్లించడం, నకిలీ బిల్లులు సమర్పించడం వంటివి ఈ కోవలోకి వస్తాయి.

అభివృద్ధి పనులలో అవకతవకలు: పనుల నాణ్యత సరిగా లేకపోవడం, కేటాయించిన పనులను పూర్తి చేయకపోవడం, లేదా టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావచ్చు. కాంట్రాక్టర్ల ఎంపికలో పారదర్శకత లోపించడం కూడా దీనికి కారణం కావచ్చు.

అధికార దుర్వినియోగం: తమ పదవిని ఉపయోగించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం, తమ బంధువులకు లేదా సన్నిహితులకు లబ్ధి చేకూర్చడం వంటి ఆరోపణలు వస్తాయి. భూ వివాదాలు, అనుమతులు మంజూరు చేయడంలో పక్షపాతం చూపడం కూడా దీని కిందకు వస్తాయి.

రికార్డుల నిర్వహణలో లోపాలు: ఆర్థిక లావాదేవీలు, గ్రామసభ తీర్మానాలు, అభివృద్ధి పనుల వివరాలు మొదలైన వాటిని సరిగ్గా నమోదు చేయకపోవడం లేదా వాటిని అందుబాటులో ఉంచకపోవడం వంటివి భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తాయి.

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు: అరుదుగా ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘనకు సర్పంచ్ బాధ్యత వహించాల్సి రావచ్చు.

న్యాయపరమైన చిక్కులను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి లేదా ముందుగానే నివారించడానికి సర్పంచులు కొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలి:

పారదర్శకత మరియు జవాబుదారీతనం:

రికార్డుల పక్కా నిర్వహణ: అన్ని ఆర్థిక లావాదేవీలు, గ్రామసభ తీర్మానాలు, అభివృద్ధి పనుల వివరాలు, బిల్లులు, రసీదులు, సమావేశాల నిమిషాలు(Minutes of meeting) వంటివాటిని పక్కాగా నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, భద్రపరచాలి.

సమయానికి ఆడిట్ చేయించుకోవాలి: పంచాయతీ నిధులకు సంబంధించిన ఆడిట్‌ను ఎప్పటికప్పుడు చేయించుకోవడం, ఆడిట్ నివేదికలను గ్రామసభలో సమర్పించడం చాలా ముఖ్యం. ఇది ఆర్థిక పారదర్శకతను పెంచుతుంది.

గ్రామసభ ఆమోదం: ఏ పని ప్రారంభించినా, నిధులు కేటాయించినా గ్రామసభ ఆమోదం తప్పనిసరి. గ్రామసభ తీర్మానాలను పక్కాగా రికార్డు చేయాలి.

చట్టాలపై అవగాహన:

పంచాయతీ రాజ్ చట్టంపై పట్టు: తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలపై సర్పంచులకు పూర్తి అవగాహన ఉండాలి. అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి.

అభివృద్ధి పథకాల వివరాలు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాల వివరాలు, వాటి అమలు నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి.

పనుల అమలులో జాగ్రత్త:

కాంట్రాక్టర్ల ఎంపికలో పారదర్శకత: అభివృద్ధి పనుల కోసం కాంట్రాక్టర్లను ఎంపిక చేసేటప్పుడు పారదర్శకతను పాటించాలి. టెండర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించాలి.

నాణ్యత పరిశీలన: పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరిగేలా చూసుకోవాలి.

పదవీ విరమణ సమయంలో స్పష్టమైన అప్పగింత:మీ పదవీకాలం ముగింపు సమయానికి, తరువాత వచ్చే సర్పంచ్‌కు లేదా స్పెషల్ ఆఫీసర్‌కు అన్ని నమోదు పుస్తకాలు, ఆస్తి జాబితాలు, గోడౌన్‌లు, పంచాయతీ ఆస్తుల కాగితాలు సరఫరా చేయాల్సి ఉంటుంది.

వీటిని సక్రమంగా రాసి, సంతకం చేసి, తేదీ వేసి అప్పగించండి.

అప్పగించే సమయంలో మీ సరిగా లేని రికార్డులు, లెక్కలు ఏమైనా కనిపిస్తే, ముందు వాటిని మీరు పూర్తి చేయండి. లేనిపక్షంలో, తరువాత వచ్చే పరిపాలకుడు మీపై “ఫిర్యాదు లేకుండా ఆస్తులు చౌర్యానికి గురయ్యాయి” అని కేసు పెట్టే ప్రమాదం ఉంటుంది.

ఉదాహరణకు, మీ వద్ద ట్రాక్టర్ ఉందనుకుంటే, దాన్ని అప్పగించే నాటికి చక్రాలు తీసేశారని పిర్యాదు చేయకముందే సరిజేసి ఇవ్వాలి. ఈ విధంగా క్లియర్ హస్తాంతరణ ఉంటే, మీరు పదవి విడిచి ఆత్మవిశ్వాసంతో ఊపిరిపీల్చుకోవచ్చు.

లేదంటే, పదవి నుంచి వెళ్లిన మిమ్మల్ని లాగి కోర్టు మెట్లెక్కించే పరిస్థితి, విచారణ కమిటీలు, పోలీసులు వెంబడించే పరిస్థితి తలెత్తవచ్చు.

పౌరులతో సంబంధాలు:

సమాచార పంపిణీ: గ్రామ పంచాయతీ కార్యకలాపాలు, అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై పౌరులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. గ్రామసభలను క్రమం తప్పకుండా నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవాలి.

ఫిర్యాదుల పరిష్కారం: గ్రామస్తుల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సకాలంలో పరిష్కరించాలి. ఇది పారదర్శకతను పెంచుతుంది.

న్యాయ సలహా:అవసరమైతే న్యాయవాదిని సంప్రదించాలి: ఏదైనా వివాదం తలెత్తే అవకాశం ఉందని భావిస్తే, లేదా తమపై ఆరోపణలు వచ్చినట్లయితే వెంటనే న్యాయ నిపుణులను సంప్రదించి తగిన సలహా తీసుకోవాలి.

“సర్పంచ్ పదవి అనేది కేవలం అధికారం కాదు, ఒక బాధ్యత.” ప్రజలకు సేవ చేయాలనే తపనతో పాటు, నిబంధనలపై అవగాహన, పారదర్శకత, మరియు పక్కా రికార్డుల నిర్వహణ సర్పంచులకు ఎంతో అవసరం. ముఖ్యంగా, పదవీ విరమణ సమయంలో పంచాయతీ ఆస్తులు, రికార్డుల స్పష్టమైన అప్పగింత చాలా కీలకం. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, పదవీకాలం తర్వాత ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, గౌరవప్రదమైన జీవితాన్ని గడపవచ్చు. నివారణే శ్రేయస్కరం అన్నట్లుగా, ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో తలెత్తే అనేక సమస్యలను అధిగమించవచ్చు.

Was this article helpful?

Frequently asked questions

  1. పదవీకాలం ముగిసిన తర్వాత సర్పంచ్‌లు ఎదుర్కొనే చట్టపరమైన సమస్యలు ఏమిటి?

    నిధుల దుర్వినియోగం, అభివృద్ధి పనులు లేదా టెండర్లలో అక్రమాలు, వ్యక్తిగత లబ్ధి కోసం లేదా బంధుప్రీతితో అధికార దుర్వినియోగం, రికార్డుల నిర్వహణలో లోపాలు వంటి ఆరోపణలు ఎక్కువగా వస్తాయి. అరుదుగా, గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు కూడా సర్పంచ్‌ను బాధ్యులను చేయవచ్చు.

    Constitutional & Writ Litigation

  2. భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా సర్పంచ్ ఏం చేయాలి?

    ప్రతి ఆర్థిక లావాదేవీ, గ్రామసభ తీర్మానం, అభివృద్ధి పని, బిల్లు, రశీదు, సమావేశ వివరాలను కచ్చితంగా నమోదు చేయాలి. పంచాయతీ నిధులకు సకాలంలో ఆడిట్ చేయించి నివేదికలను గ్రామసభ ముందు ఉంచాలి; పనులు ప్రారంభించే ముందు లేదా నిధులు ఖర్చు చేసే ముందు గ్రామసభ ఆమోదం తీసుకోవాలి; కాంట్రాక్టర్ల ఎంపికలో టెండర్ నిబంధనలు పాటించాలి.

    Constitutional & Writ Litigation

  3. పదవీకాలం ముగిసినప్పుడు సర్పంచ్ ఏమి అప్పగించాలి?

    అన్ని రిజిస్టర్లు, ఆస్తుల జాబితాలు, గోడౌన్లు, పంచాయతీ ఆస్తి పత్రాలను కొత్త సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారికి రాతపూర్వకంగా, సంతకం చేసి, తేదీతో అప్పగించాలి. అసంపూర్తిగా ఉన్న రికార్డులు లేదా లెక్కలను ముందే సరిచేసుకోవాలి; లేకపోతే లెక్కలోకి రాని లేదా కనిపించని ఆస్తుల పేరిట కొత్త యంత్రాంగం కేసు పెట్టే అవకాశం ఉంది.

    Constitutional & Writ Litigation

  4. సర్పంచ్‌కు గ్రామసభ ఆమోదం ఎందుకు ముఖ్యం?

    ఏ పని ప్రారంభించాలన్నా, నిధులు కేటాయించాలన్నా ముందుగా గ్రామసభ ఆమోదం తప్పనిసరి; ఆ తీర్మానాలను సరిగ్గా నమోదు చేయాలి. గ్రామసభ ఆమోదం లేకుండా నిధులు మళ్లించారనేది మాజీ సర్పంచ్‌లపై ఎక్కువగా వచ్చే ఆరోపణల్లో ఒకటి.

    Constitutional & Writ Litigation

  5. సర్పంచ్ న్యాయవాదిని ఎప్పుడు సంప్రదించాలి?

    వివాదం వచ్చే అవకాశం ఉన్నా, ఏదైనా ఆరోపణ వచ్చినా—పదవిలో ఉన్నప్పుడైనా, తర్వాతైనా—వెంటనే సంప్రదించాలి. ముందుగానే న్యాయ సలహా తీసుకుంటే రికార్డులు సరిగ్గా ఉంచుకోవడానికి, విచారణ కమిటీ, పోలీసులు లేదా కోర్టు వరకు వెళ్లకముందే సరిగ్గా స్పందించడానికి సహాయపడుతుంది.

    Constitutional & Writ Litigation

Comments

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Comments are moderated. Please do not share personal or case details here; for advice on your matter, book a consultation.

Get the latest updates & legal knowledge

New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.