More languages

Machine translation by Google, for convenience only. It may contain errors; the English and Telugu pages are the reliable versions.

Read this article in English

Justice Delayed is Justice Denied!

Justice Delayed is Justice Denied!

“న్యాయం ఆలస్యమైతే… అది న్యాయాన్ని నిరాకరించినట్లే” (Justice Delayed is Justice Denied) — సమాజంలో మనం తరచూ వినే మాట ఇది. ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు, అతనికి సరైన సమయంలో న్యాయం అందకపోతే ఆ తర్వాత వచ్చే తీర్పు ఎంత గొప్పదైనా దానికి విలువ ఉండదు. ఆకలితో అలమటిస్తున్న వ్యక్తికి ప్రాణాలు పోయాక విందు భోజనం పెడితే ఎంత ప్రయోజనమో, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి జీవితం ముగిసిపోయాక వచ్చే తీర్పు కూడా అంతే!

వ్యవస్థాగత లోపాలు:

భారతదేశంలో ఒక సివిల్ లేదా క్రిమినల్ కేసు ముగియడానికి ఏళ్లు, దశాబ్దాలు పట్టడం వెనుక కొన్ని చేదు నిజాలు ఉన్నాయి. ప్రధానంగా, కోర్టుల్లో గుట్టలుగా పేరుకుపోతున్న కేసులతో పోలిస్తే వాటిని విచారించే న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వ్యవస్థకు పెద్ద శాపంగా మారింది. దీనికి తోడు, చాలా కేసుల్లో నిందితులు కావాలనే రకరకాల ఎత్తుగడలతో విచారణను ఆలస్యం చేస్తుంటారు; ముఖ్యంగా పోలీస్ చార్జ్ షీట్ దాఖలైన తర్వాత కూడా నిందితులకు కోర్టు నోటీసులు (Summons) అందడానికే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇలా నిందితులు కోర్టుకు హాజరుకాకుండా వాయిదాలు కోరడం లేదా తప్పించుకు తిరగడం వల్ల, విచారణ అసలు ప్రారంభ దశలోనే స్తంభించిపోయి కేసులు నత్తనడకన సాగుతున్నాయి

ఆలస్యం బాధితులకు శాపం.. నిందితులకు వరం!

కేసులు ఆలస్యం కావడం వల్ల నిందితుల కంటే ఎక్కువగా నలిగిపోయేది బాధితులే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు తమ జీవితకాల కష్టార్జితాన్ని లేదా హక్కులను కోల్పోయి, ముసలి వయసులో ప్రశాంతంగా ఉండాల్సింది పోయి కోర్టుల చుట్టూ తిరగడం ఒక నరకంలా మారుతోంది; ఈ శారీరక శ్రమ వల్ల వారు శారీరకంగా కృశించిపోవడమే కాకుండా తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. అంతేకాకుండా, ఒక కేసు దశాబ్దాల పాటు సాగడం వల్ల కాలక్రమేణా సాక్షుల జ్ఞాపకశక్తి తగ్గిపోవడం లేదా వారు చనిపోవడం జరిగి సాక్ష్యాలు బలహీనపడతాయి, ఇది పరోక్షంగా తప్పు చేసిన నిందితుడికే లాభం చేకూరుస్తుంది. వీటన్నింటికీ తోడు, ప్రతి వాయిదాకు కోర్టుకు తిరగడం, లీగల్ ఖర్చులు మరియు లాయర్ ఫీజులు భరించడం సామాన్య, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తూ ఒక పెద్ద శాపంగా మారుతోంది.

త్వరితగతిన విచారణ: ఇది మన ప్రాథమిక హక్కు!

మన రాజ్యాంగం ప్రకారం, త్వరగా న్యాయం పొందడం అనేది కేవలం ఒక కోరిక కాదు… అది ప్రతి పౌరుడి హక్కు! రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) కింద ప్రతి ఒక్కరికీ “త్వరితగతిన విచారణ” (Right to Speedy Trial) పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది (హుస్సేనారా ఖాతూన్ కేసు తీర్పు దీనికి పెద్ద ఉదాహరణ). న్యాయం అనేది కేవలం నిందితుల హక్కులను కాపాడటానికే కాదు, బాధితుడికి సకాలంలో ఊరటనివ్వడానికి కూడా! 

మరి కింది కోర్టుల్లో (Trial Courts) కేసు కేవలం నిందితులు రావడం లేదనో, లేదా మరేదైనా కారణంతో సంవత్సరాల తరబడి ఒకే చోట ఆగిపోతే బాధితుడు ఏం చేయాలి? లబోదిబోమంటూ కూర్చోవాలా? లేదు!

బాధితుడు లాయర్ ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 482 (ప్రస్తుత BNSS లోని సెక్షన్ 528) కింద హైకోర్టులో “Early Disposal Petition” (త్వరితగతిన కేసు పరిష్కార పిటిషన్) దాఖలు చేయవచ్చు. 

ఎటువంటి సందర్భాలలో హైకోర్టులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 482 (ప్రస్తుత BNSS లోని సెక్షన్ 528) కింద ‘Early Disposal’ కోరవచ్చు? 

హైకోర్టులో Early Disposal Petition దాఖలు చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఉండాలి. ముఖ్యంగా నిందితులు కావాలనే వాయిదాలు కోరుతూ విచారణను అడ్డుకుంటున్నా, చార్జ్ షీట్ దాఖలయ్యాక కూడా కేవలం సమన్లు లేదా నిందితుల హాజరు కోసమే (Summons / Appearance Stage) కేసు సంవత్సరాల తరబడి ఒకే చోట స్తంభించిపోయినా హైకోర్టును ఆశ్రయించవచ్చు. వీటితో పాటు బాధితులు వృద్ధులు లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నా, కేసు మరీ సుదీర్ఘంగా సాగడం వల్ల కాలక్రమేణా సాక్షులు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉన్నా, మరియు మహిళలు లేదా సీనియర్ సిటిజన్ల కేసులపై సుప్రీంకోర్టు ఇచ్చిన కాలపరిమితి మార్గదర్శకాలను కింది కోర్టులు పాటించనప్పుడు బాధితుడు ‘త్వరితగతిన పరిష్కారం’ కోరడానికి ఖచ్చితమైన అర్హత పొందుతాడు.

సకాలంలో అందని న్యాయం… అన్యాయంతో సమానం!

న్యాయ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకం కలగాలంటే తీర్పులు సరైన సమయంలో రావాలి; ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ప్రాణాలు పోయాక వచ్చే తీర్పు బాధితుడికి ఏమాత్రం ఉపశమనాన్ని ఇవ్వలేదు. అందుకే, వృద్ధులైన బాధితులు తమ జీవితాంతం నిరీక్షించే పరిస్థితి మారాలి సకాలంలో అందని న్యాయం, బాధితుడికి మరోసారి అన్యాయం చేయడంతోనే సమానమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

Was this article helpful?

Frequently asked questions

  1. “న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్లే” అంటే అర్థం ఏమిటి?

    అన్యాయానికి గురైన వ్యక్తికి సకాలంలో న్యాయం దక్కకపోతే, తర్వాత వచ్చే తీర్పు ఎంత గొప్పదైనా దానికి విలువ ఉండదు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత, లేదా బాధితుడు మరణించిన తర్వాత వచ్చే తీర్పు బాధితుడికి నిజమైన ఊరట ఇవ్వదు.

    Criminal Defense, Bail & Quash Petitions

  2. భారతదేశంలో త్వరితగతిన విచారణ పొందడం చట్టపరమైన హక్కా?

    అవును. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) కింద త్వరితగతిన విచారణ పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది; హుస్సేనారా ఖాతూన్ కేసు తీర్పు దీనికి ప్రముఖ ఉదాహరణ. సకాలంలో న్యాయం నిందితుడి హక్కులనే కాదు, బాధితుడి హక్కులనూ కాపాడుతుంది.

    Criminal Defense, Bail & Quash Petitions

  3. భారతదేశంలో కేసులు ఇంత ఆలస్యం ఎందుకు అవుతున్నాయి?

    ప్రధాన కారణం—పేరుకుపోతున్న కేసులతో పోలిస్తే న్యాయమూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం. చాలా క్రిమినల్ కేసుల్లో నిందితులు సమన్లు అందుకోకుండా తప్పించుకోవడం, పదే పదే వాయిదాలు కోరడం ద్వారా విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తారు; దీంతో కేసు ప్రారంభ దశలోనే నిలిచిపోతుంది.

    Criminal Defense, Bail & Quash Petitions

  4. క్రిమినల్ కేసు ఏళ్ల తరబడి కింది కోర్టులో నిలిచిపోతే బాధితుడు ఏం చేయవచ్చు?

    బాధితుడు న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించి, కేసును త్వరగా పరిష్కరించాలని కోరుతూ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 482 (ప్రస్తుత బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 528) కింద "ఎర్లీ డిస్పోజల్ పిటిషన్" దాఖలు చేయవచ్చు.

    Criminal Defense, Bail & Quash Petitions

  5. కేసును త్వరగా పరిష్కరించాలని హైకోర్టును ఎప్పుడు కోరవచ్చు?

    ఉదాహరణకు: నిందితుడు ఉద్దేశపూర్వకంగా వాయిదాలు కోరుతున్నప్పుడు; ఛార్జిషీట్ దాఖలైన తర్వాత కూడా కేసు ఏళ్ల తరబడి సమన్లు లేదా హాజరు దశలోనే ఉన్నప్పుడు; బాధితులు వృద్ధులు లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు; కాలక్రమంలో సాక్షులు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉన్నప్పుడు; మహిళలు లేదా వృద్ధుల కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలపరిమితి మార్గదర్శకాలను కింది కోర్టులు పాటించనప్పుడు.

    Criminal Defense, Bail & Quash Petitions

Comments

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

Comments are moderated. Please do not share personal or case details here; for advice on your matter, book a consultation.

Get the latest updates & legal knowledge

New articles, important court judgments and practical legal tips, explained in simple language and sent to you on WhatsApp.